గర్భిణులకు ఛాతిలో మంటగా ఉంటుందా..? కారణం ఇదే

ప్రెగ్నెన్సీ సమయంలో.. మహిళలు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏది తిన్నా వాంతులు అవుతుంటాయి, సరిగ్గా నిద్రపట్టదు, కాళ్లు ఊరికే వాస్తాయి. ఇంకొంతమందికి ఏదైనా తినగానే ఛాతిలో మంటగా ఉంటుంది.

గర్భిణులకు ఛాతిలో మంటగా ఉంటుందా..? కారణం ఇదే
Heartburn in Pregnancy


ప్రెగ్నెన్సీ సమయంలో.. మహిళలు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏది తిన్నా వాంతులు అవుతుంటాయి, సరిగ్గా నిద్రపట్టదు, కాళ్లు ఊరికే వాస్తాయి. ఇంకొంతమందికి ఏదైనా తినగానే ఛాతిలో మంటగా ఉంటుంది. కడుపులోని ఆమ్లాలు అన్నవాహికపైకి రావడం, గొంతు వైపు కదలడం వల్ల ఇలాంటి పెయిన్ వస్తుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు తరుచుగా యాసిడ్ రిప్లక్స్ సమస్య ఎదురవుతుంది. కొన్ని సూచనలు పాటించడంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

కారణం అదే

ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయినప్పటి నుంచి డెలివరీ వరకు కొన్ని సమస్యలు ఉంటాయి. వీటి నుంచి తమతో పాటు బిడ్డను రక్షించుకోవడానికి మహిళలు జాగ్రత్తగా ఉండాలి.. కొన్నిసార్లు బిడ్డకు జన్మనిచ్చాక కూడా సమస్యలు తలెత్తవచ్చు. గర్భిణులకు తరచూ ఏర్పడే కామన్ ప్రాబ్లమే యాసిడ్ రిఫ్లక్స్. కడుపులో ఆమ్లాలు అతిగా ఉత్పత్తి అయినా బేబీ పెరుగుదల కారణంగా వెన్నుపై ఒత్తిడి పెరిగినా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఏర్పడుతుంది.

లక్షణాలు

యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను సులువుగా గుర్తించొచ్చు. కడుపు నిండిన భావన కలగడం, ఛాతీలో మంటగా అనిపించడం, తేన్పులు రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తినగానే ఈ సమస్య ఎదురవుతుంది. ఎక్కువ సేపు కడుపును ఖాళీగా ఉంచినా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. వీటిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా ముందే జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

 లైఫ్‌స్టైల్‌ మార్చాలి

యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి బయట పడాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోక తప్పదు. ముఖ్యంగా ఆహార అలవాట్లను మార్చుకోవాలి. స్పైసీ, నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. కొద్ది కొద్దిగా వీలైనన్ని ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ ఆహారం తినాలని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అది సరికాదు. రోజువారీ అవసరాలను బట్టి పోషకాహారం తీసుకోవాలి. కెఫిన్ డ్రింక్స్‌ పూర్తిగా దూరం పెట్టడం మంచిది. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 3 గంటల విరామం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

భోజనం చేసే సమయంలో సరిగ్గా కూర్చోవాలి. పడుకునేటప్పుడు తల కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోండి. వీటితో పాటు రోజులో కనీసం 3లీటర్లకు పైగా ద్రవాలు తీసుకోవాలి. తిన్న తర్వాత కనీసం ఓ 15 నిమిషాల పాటు అటు ఇటు నడవాలి. స్మోకింగ్ అస్సలు వద్దు.. ఆల్కహాల్ తీసుకోవద్దు. అన్నిటికన్నా ముఖ్యంగా సొంత వైద్యం అస్సలు పనికిరాదు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.