మానసిక ఒత్తిడిని జయించాలంటే.. రివర్స్‌లో నమస్కారం పెట్టండి..! 

యోగా చేయడం వల్ల మనిషి శరీరం అంతర్గతంగా క్లీన్‌ అవుతుంది. చాలా మంది జిమ్ చేయడం వల్లనే ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటారు. యోగా వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది.

మానసిక ఒత్తిడిని జయించాలంటే.. రివర్స్‌లో నమస్కారం పెట్టండి..! 


యోగా చేయడం వల్ల మనిషి శరీరం అంతర్గతంగా క్లీన్‌ అవుతుంది. చాలా మంది జిమ్ చేయడం వల్లనే ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటారు. యోగా వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. యోగాలో కొన్ని వేల రకాల ఆసనాలు ఉన్నాయి. ఈరోజు మనం పశ్చిమ నమస్కారాసనం గురించి తెలుసుకుందాం.  
ఈ ఆసనాన్ని రివర్స్ ప్రేయర్ పోజ్ అని కూడా పిలుస్తారు. రెండు చేతులు వీపు వెనుకకు పెట్టి నమస్కారం చేయడాన్ని పశ్చిమ నమస్కార ఆసనం అంటారు. ఈ ఆసనం భుజాలు, మణికట్టు, వెన్నెముక మీద చక్కని ప్రభావం చూపిస్తుంది. నేలపై కూర్చుని కాళ్ళు ముందు చాచి ఈ ఆసనం వేయాలి. అరచేతులు రెండూ కలిపి నమస్కారం చేయలేకపోతే వేళ్ళని అయినా కలపాలి. ఇది చేస్తున్నప్పుడు గట్టిగా శ్వాస తీసుకోవాలి.

ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ ఆసనం చేయడం కాస్త కష్టమైన పనే. కానీ తరచూ వేస్తూ ఉంటే సాధించగలుగుతారు. 30 సెకన్ల నుంచి ఒక నిమిషం పాటు ఈ భంగిమలో ఉండాలి. భుజాలు రిలాక్స్‌గా ఉంచి వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

ఆరోగ్య ప్రయోజనాలు

ఇది వెన్నుముకని సాగదీసి బలంగా మారుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతతని ఇస్తుంది. 
ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది. 
ఉదర అవయవాలు సున్నితంగా మసాజ్ చేసినట్టుగా అవుతాయి. 
జీర్ణక్రియకి కూడా సహాయపడుతుంది. 
వెన్నునొప్పిని తగ్గిస్తుంది. 
మణికట్టు సమస్యలు పరిష్కరించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. 
ప్రకోప పేగు సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక జీర్ణ రుగ్మతలు నయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

ఈ తప్పులు చేయొద్దు

చేతులు వీపు వెనకకు నమస్కారం చేసేందుకు రాకపోతే బలవంతంగా వాటిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నించకండి. అలా చేస్తే చేతులు పట్టుకుపోతాయి. వీపుపై ఒత్తిడిని నివారించేందుకు వెన్నెముకని వీలైనంత వరకు నిటారుగా ఉంచాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు లోతైన శ్వాస తీసుకోవాలి. ఊపిరి బిగపట్టడం వంటివి చేస్తే మాత్రం అసౌకర్యం పెరిగిపోతుంది.

ఎవరు ఈ ఆసనం వేయకూడదు

భుజాల నొప్పులు, బిగుతుగా ఉండే భుజాలు, కండరాల నొప్పులు ఉన్న వ్యక్తులు ఈ భంగిమ ప్రయత్నించే ముందు కొన్ని సున్నితమైన స్ట్రెచ్ చేయడం మంచిది. ఈ ఆసనం నెమ్మదిగా ప్రారంభించాలి. తప్పనిసరిగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. దీనిపై ఎటువంటి అవగాహన లేని కొత్త వ్యక్తులు ఈ ఆసనం వేసే ముందు అన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. ఈ ఆసనం తప్పుగా వేస్తే ఛాతీ, మణికట్టు, భుజాలు, మోచేతులకి హాని కలగవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.