ఎండాకాలంలో చర్మానికి తీసుకోవాల్సి జాగ్రత్తలు

అసలే ఎండాకాలం...బయటకు రావాలంటే ప్రహసనంతో కూడిన పనే. డీహైడ్రేషన్ తో పాటు చర్మ సమస్యలు. చర్మం కమిలిపోతుంది. విపరీతంగా చెమటలు పోస్తాయి. ఎండాకాలంలో సాధారణంగా నీరసం, నిస్తేజం, చిరాకు వంటివి సహజంగానే ఉంటాయి.

ఎండాకాలంలో చర్మానికి తీసుకోవాల్సి జాగ్రత్తలు


అసలే ఎండాకాలం...బయటకు రావాలంటే ప్రహసనంతో కూడిన పనే. డీహైడ్రేషన్ తో పాటు చర్మ సమస్యలు. చర్మం కమిలిపోతుంది. విపరీతంగా చెమటలు పోస్తాయి. ఎండాకాలంలో సాధారణంగా నీరసం, నిస్తేజం, చిరాకు వంటివి సహజంగానే ఉంటాయి. కాసేపు పని చేస్తే చాలు శరీరం అలసిపోయి, సొమ్మసిల్లినట్లు అనిపిస్తుంది. బయటకువెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే......అటు గట్టి ఎండల్లోనూ ఆరోగ్యంగా ఉండొచ్చు. అందాన్ని కాపాడొచ్చు. మరి అవెంటో తెలుసుకుందాం.


రోజూ మంచినీళ్లు తాగాలి

ప్రపంచంలో మంచినీటి కన్నా మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ఎందుకంటే సర్వరోగాలను నయం చేసేది.....మంచినీరే. అన్ని కాలాల్లోనూ మనకు చేదోడుగా ఉంటుంది. ఒక్కోసారి మనకు కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. కానీ అది ఆకలి కాదు...శరీరానికి నీళ్లు కావాలనే సంకేతం. దీన్ని మనం గ్రహించాలి. అందులో ఎండాకాలంలో మంచి నీటి వినియోగం గురించి చెప్పాలంటే అంతా ఇంతా కాదు. శరీరానికి డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. దాహంగా అనిపించకపోయినా.....తాగుతూ ఉండాలి.


పుదీనా

ఈ కాలంలో పుదీనా టీని ఎంచుకుంటే చాలా బెటర్. దాని వల్ల ఎండ ప్రభావాన్ని కొంతవరకూ తట్టుకోవచ్చు. గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. అలానే శరీరంలో రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసం వేసవికి ఔషధం లాంటిది. ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను నాశనం చేస్తుంది. తద్వారా బరువు కూడా తగ్గొచ్చు.


శరీరానికి మసాజ్

ఈ సమయంలో స్నానానికి ముందు శరీరాన్ని కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కొన్ని పరిశోధనల్లో ఈ మసాజ్‌తో జీర్ణసమస్యలు కూడా తగ్గిపోతాయని తేలింది.


ఈ సమ్మర్ లో ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకోకూడదు. అంతేకాకుండా శీతపానీయాలు కూడా తీసుకోకూడదు. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి తప్ప......వేడి తగ్గదు. ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇంకో విషయం మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. సరైన సమయానికి భోజనం చేయాలి. మసాలా పదార్థాలను తగ్గించాలి. దానివల్ల మొహంపై మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు శరీరానికి చల్లదనం కలిగించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

పెరుగు, మజ్జిగ

ఉప్పు, కొద్దిగా మసాలాలు జోడించి పెరుగు చిలికి చేసే మజ్జిగ శరీరంలో వేడిని చల్లారుస్తుంది. డీహైడ్రేషన్‌ ను నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ల భరితం. వేసవి తాపంతో పోరాడటానికి మజ్జిగ ఒక మంచి ఆప్షన్‌. దీనిలో క్యాలరీలు తక్కువ. కాల్షియం, పొటాషియంతో పాటు ప్రొటీన్‌ కూడా దీని నుంచి దొరుకుతుంది. అసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పెరుగు తీసుకోవడం కూడా మంచిదే.

అలా అని రాత్రి వేళల్లో పెరుగు అసలే తీసుకోకూడదు. దానివల్ల పడుకునేటప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మజ్జిగలా మాత్రమే తీసుకుంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.


కాఫీ, టీలు తగ్గించాలి

అసలే మండే ఎండలు..అందులోనూ కాఫీ, టీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్తపడడం ముఖ్యం.


జంక్ ఫుడ్ తగ్గించాలి, పండ్లు తీసుకోవాలి

గ్రిల్డ్ ఫుడ్, చిప్స్, చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్‌ తగ్గించాలి. దీనివల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. పుచ్చకాయలు, దోసకాయలు, బ్రకోలి ఇలాంటి వాటిని తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో నీటిశాతం పెరిగుతుంది.


కొత్తిమీర

కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

చర్మ సంరక్షణ ముఖ్యం

వేసవిలో సన్‌స్క్రీన్‌ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. ఈ సన్‌ స్క్రీన్‌ లోషన్‌ని బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోండి. సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడటం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి రక్షణ ఉంటుంది.


ఎండల్లో బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని కవర్‌ చేసుకోవడం అవసరం. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్‌ గ్లాసెస్‌ని ధరించడం, తలకు పెద్ద టోపీ పెట్టుకోవడం పైగా ఎలాంటి సమస్యలూ రావు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.