గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ

సాధారణంగా గుండెపోటు మహిళల కంటే పురుషులకే ఎక్కువగా వస్తుంది అంటారు. కారణాలు ఏమైనా కానీ ఇది కాస్త వాస్తవమే. అయితే మహిళలకు కూడా గుండెపోటు వస్తుంది. మహిళల్లో గుండెపోటు పెరగడానికి ప్రధాన కారణాలను వైద్యులు వివరిస్తున్నారు. మెట్రోపాలిటన్

గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ


సాధారణంగా గుండెపోటు మహిళల కంటే పురుషులకే ఎక్కువగా వస్తుంది అంటారు. కారణాలు ఏమైనా కానీ ఇది కాస్త వాస్తవమే. అయితే మహిళలకు కూడా గుండెపోటు వస్తుంది. మహిళల్లో గుండెపోటు పెరగడానికి ప్రధాన కారణాలను వైద్యులు వివరిస్తున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే మహిళలు ఎక్కువగా ధూమపానం చేస్తున్నారు. ఉద్యోగ ప్రపంచంలో కలిగే ఒత్తిడి, కుటుంబ ఒత్తిడిని తగ్గించుకునేందుకు వారు ధూమపానానికి, మద్యపానానికి అలవాటు పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ధూమపానం చేసే మహిళల్లో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడే మహిళల్లో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మహిళల్లో గుండెపోటు లక్షణాలు వేరు..

పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. వారికి ఎడమవైపు ఛాతీ నొప్పి రాకపోవచ్చు. దానికి బదులుగా భుజాలలో నొప్పి రావడం, దవడలు నొప్పిగా అనిపించడం, చేతులకు రెండు వైపులా నొప్పి రావడం, విపరీతంగా చెమట పట్టడం వంటివి జరుగుతాయి. ఒకప్పుడు పురుషులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పిన విషయం నిజమే కానీ ఇప్పుడు పురుషులు, మహిళలు ఇద్దరూ సమానంగా గుండె జబ్బుల ప్రమాదంలో ఉన్నారు. 
మహిళలు గుండెపోటుకు తక్కువ గురవ్వడానికి కారణం వారి శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్లు. ఈస్ట్రోజన్ హార్మోన్లలో సమతుల్యత దెబ్బ తింటే వారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళల జీవన శైలిలో మార్పు రావడం, పని ఒత్తిడి పెరగడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్లు పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం ఇవన్నీ కూడా మహిళల్లో గుండెపోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. 
మహిళలు జీవితంలో ఒత్తిడిని తగ్గించుకొని, విశ్రాంతి తీసుకోవాలి. మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. దీనివల్ల గుండెపోటు వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. గుండెకు మేలు చేసే ఆహారాన్ని అధికంగా తింటూ ఉండాలి. చేపలు, ఆకుపచ్చని కూరగాయలు, టొమాటోలు వంటివి అధికంగా తినాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, నట్స్, డార్క్ చాక్లెట్లు వంటివి అధికంగా తింటే మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.