ప్రపంచంలో ఏటా అత్యధిక శాతం మంది మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండె జబ్బులు రెండో స్థానంలో ఉన్నాయి. ఏటా అనేక లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్ల వల్ల చనిపోతున్నారు. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రవాహానికి ఏదైనా అడ్డుపడితే అప్పుడు గుండెకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తాయి. ఈ క్రమంలో ఛాతిలో అసౌకర్యం, ఛాతిలో తీవ్రమైన నొప్పి, చేతుల్లో నొప్పిగా ఉండడం, అజీర్ణం, జీర్ణాశయంలో అసౌకర్యం, తీవ్రంగా చెమట పట్టడం, వాంతులు కావడం, ఆందోళన, అలసట, వేగంగా లేదా అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు అన్నీ అందరిలో ఒకేలా ఉండవు. కొందరిలో కొన్నే కనిపిస్తాయి.

వారంలో ఒక్క రోజులో మాత్రం హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. అవును.. సోమవారం రోజు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తాయని తెలిపారు. అందుకు గాను సైంటిస్టులు 7 సంవత్సరాలుగా సుమారుగా 1,56,000 హాస్పిటళ్లలో హార్ట్ ఎటాక్‌లు వచ్చిన వారి వివరాలను సేకరించి విశ్లేషించారట.. దీంతో చాలా మందికి సోమవారం రోజునే ఎక్కువగా హార్ట్ ఎటాక్‌లు వచ్చినట్లు వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను అమెరికన్ హార్ట్ జర్నల్‌లోనూ ప్రచురించారు.
కారణం ఏంటి..
శని, ఆది వారాల్లో ఎవరైనా వీకెండ్ అని ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆఫీసుకో, కాలేజీకో, స్కూల్‌కో వెళ్లాలంటే వెళ్ల బుద్ధి కాదు. ముందురోజు ఆలస్యంగా నిద్రపోతారు. దీంతో మన శరీరంలో ఉండే అంతర్గత వ్యవస్థ అయిన సర్కేడియన్ రిథమ్ దెబ్బ తింటుంది. శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల సోమవారం రోజు చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తాయని సైంటిస్టులు తేల్చారు.
ఇక్కడ కేవలం సోమవారం రోజునే హార్ట్ ఎటాక్ వస్తుందని చెప్పడం లేదు. సోమవారం ఎక్కువగా వస్తాయని మాత్రమే చెప్తున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా హార్ట్ ఎటాక్ రావచ్చు. కనుక ఆ స్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం ఉత్తమం. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు నిద్ర పోవడం చేస్తే హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.